Luke 22
పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను.
ప్రధాన యాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉపాయము వెదకుచుండిరి.
అంతట పన్నెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను.
గనుక వాడు వెళ్ళి ఆయనను వారి కేలాగు అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోను అధిపతులతోను మాటలాడెను.
అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
"పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా,"
యేసు పేతురును యోహానును చూచి - ''మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి'' అని వారిని పంపెను.
"వారు మేమెక్కడ సిద్ధపరచ గోరుచున్నావని ఆయనను అడుగగా,"
"ఆయన - ''ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్ళకుండ మోసికొని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు యింటిలోనికి అతని వెంట వెళ్ళి,"
నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
అతడు సామగ్రి గల యొక గొప్ప మేడ గది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడి'' అని వారితో చెప్పెను.
వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడ అపొస్తులులును పంక్తిని కూర్చుండిరి.
అప్పుడాయన - ''నేను శ్రమపడక మునుపు మీతో కూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశ పడితిని.
"అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను'' అని వారితో చెప్పి,"
ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ''మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి;
ఇక మీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను'' అనెను.
"పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి, ''ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి'' అని చెప్పెను."
ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని - ''ఈ గిన్నె మీ కొరకు చిందింప బడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.
ఇదిగో నన్నప్పగించు వానిచెయ్యి నాతో కూడ ఈ బల్ల మీద నున్నది.
నిర్ణయింప బడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ'' అని చెప్పెను.
వారు - ఈ పనిని చేయబోవు వాడెవరో అని తమలో తాము అడుగుకొనసాగిరి.
"తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా,"
ఆయన వారితో ఇట్లనెను - ''అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు; వారి మీద అధికారము చేయువారు ఉపకారులనబడదురు.
"మీరైతే ఆలాగు ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను."
గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా? పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండు వాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను.
"నా శోధనలలో నాతో కూడ నిలిచియున్నవారు మీరే,"
"గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి,"
"ఇశ్రాయేలు పన్నెండు గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించు చున్నాను''"
"''సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని"
నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము'' అని చెప్పెను.
"అయితే అతడు - ప్రభువా, నీతో కూడ చెరలోనికిని, మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో ననగా,"
"ఆయన- ''పేతురూ, నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పువరకు, నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను'' అనెను."
"మరియు ఆయన ''సంచియు జాలెయు చెప్పులును లేకుండ నేను మిమ్మును పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా?'' అని వారి నడిగినప్పుడు, వారు - ఏమియు తక్కువ కాలేదనిరి."
అందుకాయన- ''ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకొని పోవలెను; కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను.
- ఆయన అక్రమ కారులలో నొకడుగా యెంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేర వలసియున్నది; ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను'' అనెను.
"వారు - ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా, ''చాలును'' అని ఆయన వారితో చెప్పెను."
"తరువాత ఆయన బయలుదేరి, తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులును ఆయన వెంట వెళ్ళిరి."
"ఆ చోట చేరి ఆయన వారితో - ''మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్ధన చేయుడి'' అని చెప్పి,"
వారియొద్ద నుండి రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళుని
"''తండ్రీ, యీ గిన్నె నా యొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా యిష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక'' అని ప్రార్థించెను"
అప్పుడు పరలోకమునుండి యొక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.
"ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థనచేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్తబిందువులవలె ఆయెను."
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి-
''మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి'' అని వారితో చెప్పెను.
"ఆయన ఇంకను మాటలాడుచుండగా, కొందరు జనులు గుంపులుగా వచ్చిరి. పన్నెండు మందిలో యూదా అనబడిన వాడు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా,"
"యేసు - ''యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా?'' అని వానితో అనగా,"
"ఆయన చుట్టు నున్నవారు జరుగబోవు దానిని చూచి - ప్రభువా, కత్తితో నరుకుదుమా? అని ఆయన నడిగిరి."
"అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి, వాని కుడి చెవి తెగ నరికెను."
అయితే యేసు - ''ఈ మట్టుకు తాళుడి'' అని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేసెను.
యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను- ''మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరా ?
నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును'' అనెను.
వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని యింటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను.
"అంతట కొందరు నడుముంగిట మంటవేసుకొని చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను."
అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి - ''వీడును అతనితో కూడ నుండెను'' అని చెప్పెను.
"అందుకు పేతురు - ''అమ్మాయీ, నేనతని నెరుగను'' అనెను.."
"మరికొంత సేపటికి మరియొకడు అతని చూచి - ''నీవును వారిలో ఒకడవు'' అనగా, పేతురు - ''ఓయీ నేను కాను'' అనెను."
"ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు - ''నిజముగా వీడును అతనితో కూడ నుండెను, వీడు గలిలయుడు'' అని దృఢముగా చెప్పెను."
"అందుకు పేతురు- ''ఓయీ, నీవు చెప్పునది నాకు తెలియదు'' అనెను. అతడింకను మాటలాడు చుండగా వెంటనే కోడి కూసెను."
"అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను, గనుక పేతురు - నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్నెరుగ నందువని ప్రభువు తనతో చెప్పినమాట జ్ఞాపకము చేసుకొని,"
వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను.
"యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి, కొట్టి, ఆయన ముఖము కప్పి,"
నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిరి.
ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
"ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధాన యాజకులును శాస్త్రులును సభ కూడి, ఆయనను తమ మహా సభలోనికి తీసుకొని పోయి,"
నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన ''నేను మీతో చెప్పిన యెడల మీరు నమ్మరు.
అదియును గాక నేను మిమ్మును అడిగిన యెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగును'' అని వారితో చెప్పెను.
"అందుకు వారందరు - అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా, ఆయన ''మీరన్నట్టు నేనే ఆయనను'' అని, వారితో చెప్పెను."
అందుకు వారు - మనకిక సాక్షులతో పనియేమి? మనము అతని నోటి మాట వింటిమి గదా? అని చెప్పిరి.