Mark 9
మరియు ఆయన - ''ఇక్కడ నిలిచి యున్నవారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచిచూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను'' అనెను.
"ఆరు దినములైన తరువాత, యేసు పేతురును, యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని, ఎత్తయిన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి యెదుట రూపాంతరము పొందెను."
అంతలో ఆయన వస్త్రములు ప్రకాశ మానమైనవియు మిగుల తెల్లనివియు ఆయెను. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా చలువ చేయలేడు.
మరియు మోషేయు ఏలీయాయు వారికి కనబడి యేసుతో మాటలాడు చుండిరి.
"అప్పుడు పేతురు - బోధకుడా, మనమిక్కడనుండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను."
వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు.
"మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా- ''ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి'' అని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను."
"వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు, తమయొద్ద నున్న యేసు తప్ప ఎవరును వారికి కనబడలేదు."
వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా - ''మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోను చెప్పవద్దు'' అని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో మరియొకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
"వారు - ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన నడిగిరి."
అందుకాయన ''ఏలీయా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుటయేమి ?
ఏలీయా వచ్చెననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమ కిష్టము వచ్చినట్లు అతని యెడల చేసిరనియు మీతో చెప్పుచున్నాను'' అని వారితో అనెను.
"వారు శిష్యుల యొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి."
వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతినొంది ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి.
"ఆప్పుడాయన- మీరు దేనిని గూర్చి వారితో తర్కించుచున్నారని వారి నడుగగా,"
"జనసమూహములలో నొకడు- బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చితిని."
"అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను."
"అందుకాయన- ''విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంత కాలము మీతో నుందును ? ఎంత వరకు మిమ్మును సహింతును ? వానిని నా యొద్దకు తీసుకొని రండి'' అని వారితో చెప్పగా,"
. వారాయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వానిని విలవిల లాడించెను గనుక వాడు నేలపై పడి నురుగు కార్చు కొనుచు పొర్లాుచుండెను.
". అప్పుడాయన- ''ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది'' అని వాని తండ్రి నడుగగా, అతడు - బాల్యము నుండియే"
అది వానిని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.
అందుకు యేసు - ''నమ్ముట నీవలననైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే''యని అతనితో చెప్పెను.
వెంటనే ఆ చిన్నవాని తండ్రి - నమ్ముచున్నాను; నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని కన్నీళ్ళు విడిచి బిగ్గరగా చెప్పెను.
"జనులు గుంపుగూడి తన యొద్దకు పరుగెత్తుకొని వచ్చుట యేసు చూచి- ''మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదలి పొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను'' అని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను."
అప్పుడది కేక వేసి వానినెంతో విలవిలలాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చిన వానివలె నుండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి.
అయితే యేసు వాని చెయ్యి పట్టుకొని వానిని లేవనెత్తగా వాడు నిలువబడెను.
ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు- మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేక పోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.
అందు కాయన ''ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యము'' అని వారితో చెప్పెను.
వారక్కడ నుండి బయలు దేరి గలిలయ గుండ వెళ్ళుచుండిరి. అది ఎవరికిని తెలియుట ఆయన కిష్టము లేకుండెను.
ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు - ''మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగించబడు చున్నాడు. వారాయనను చంపెదరు. చంపబడిన మూడు దినములకాయన లేచును'' అని వారితో చెప్పెను.
వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగ భయపడిరి.
"అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు - ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో నొకడు వాదించు చుంటిరి'' గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు ''మార్గమున మీరు ఒకరితో నొకరు దేనిని గూర్చి వాదించు చుంటిరి'' అని వారి నడుగగా,"
వారు ఊరకుండిరి.
"అప్పుడాయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి - ''ఎవడైనను మొదటివాడై యుండగోరిన యెడల, వాడందరిలో కడపటి వాడును అందరికి పరిచారకుడునై యుండవలెను'' అని చెప్పి,"
యొక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యలో నిలువబెట్టి వానిని ఎత్తికొని కౌగలించుకొని-
''ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును; నన్ను చేర్చుకొను వాడు నన్ను గాక నన్ను పంపినవానిని చేర్చుకొనును'' అని వారితో చెప్పెను.
"అంతట యోహాను - బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచితిమని చెప్పెను."
"అందుకు యేసు- ''వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవ్వడునూ లేడు."
. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే''
"మీరు క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్ళు త్రాగ నిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకని అభ్యంతర పరచువాడెవడో; వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయ బడుట వానికి మేలు.
నీ చెయ్యు నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికివేయుము.
నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటె అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు.
నీ పాదము నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని నరికివేయుము.
"రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటె, కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు."
నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాని తీసి పారవేయుము. రెండు కన్నులు కలిగి నరకములో పారవేయబడుట కంటె ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
"నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు."
ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును
ఉప్పు మంచిదే గాని అది నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పుసారముగలవారై యుండి ఒకరితో నొకరు సమాధానముగా నుండుడి'' అని చెప్పెను.