:

Psalms 139

1

"యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలిసికొని యున్నావు"

2

నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపు పుట్టకమునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు.

3

"నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసియున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలిసికొనియున్నావు."

4

"యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది."

5

వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.

6

ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.

7

నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?

8

నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు

9

నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను

10

అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడిచేయి నన్ను పట్టుకొనును

11

అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును అని నేనను కొనిన యెడల

12

చీకటియైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి

13

నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

14

నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.

15

నేను రహస్యమందు పుట్టిననాడు భూమియొక్క అగాధస్థలములలో విచిత్రముగా నిర్మింపబడిననాడు నాకు కలిగినయెముకలును నీకు మరుగై యుండలేదు

16

నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంథములో లిఖితము లాయెను.

17

"దేవా, నీ తలంపులు నా కెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది."

18

వాటిని లెక్కించెద ననుకొంటినా అవి యిసుక కంటెను లెక్కకు ఎక్కువై యున్నవి నేను మేల్కొంటినా యింకను నీయొద్దనే యుందును.

19

"దేవా,నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు నరహంతకులారా, నాయొద్దనుండి తొలగిపోవుడి."

20

వారు దురాలోచనతో నిన్నుగూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమునుబట్టి ప్రమాణము చేయుదురు.

21

"యెహోవా, నిన్ను ద్వేషించువారిని నేనును ద్వేషించు చున్నాను గదా? నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను గదా?"

22

వారియందు నాకు పూర్ణద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను

23

"దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము"

24

నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.

Link: