:

Psalms 40

1

యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.

2

నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.

3

తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమి్మకయుంచెదరు.

4

గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

5

"యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు."

6

బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.

7

అప్పుడుపుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.

8

"నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది."

9

"నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది."

10

నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.

11

"యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక"

12

లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది.

13

"యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము."

14

నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.

15

నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందు దురు గాక.

16

నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారుయెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యముచెప్పుకొందురు గాక.

17

"నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము."

Link: