Revelation 17
"ఆ ఏడు పాత్రలను పట్టుకొనియున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పెను - నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనుపరచెదను."
"భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మద్యములో మత్తులైరి."
"అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా, దేవదూషణ నామములతో నిండుకొని, ఏడు తలలును పది కొమ్ములును గల ఎఱ్ఱని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని."
"ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింప బడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణపాత్రను తనచేత పట్టుకొనియుండెను."
"దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడి యుండెను - మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లియైన మహాబబులోను."
"మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముచేతను, యేసుయొక్క హతసాక్షుల రక్తముచేతను మత్తిల్లి యుండుట చూచితిని. నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా,"
"ఆ దూత నాతో ఇట్లనెను - నీవేల ఆశ్చర్యపడితివి ? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును కలిగి దాని మోయుచున్న క్రూరమృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను."
"నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు; అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని ఆశ్చర్యపడుదురు."
ఇందులో జ్ఞానముగల మనస్సు కనబడును. ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు;
"మరియు ఏడుగురు రాజులు కలరు; అయిదుగురు కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమ వాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను."
"ఉండినదియు ఇప్పుడు లేనిదియునైన ఈ క్రూరమృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునైయుండి, తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును."
నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ క్రూరమృగముతో కూడ రాజులవలె అధికారము పొందుదురు.
వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
"వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడ ఉండినవారు పిలువబడినవారై, ఏర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును."
"మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను - ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాటలాడువారిని సూచించును."
"నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేని దాని గాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు."
దేవుని మాటలు నెరవేరువరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుటవలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను.
మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే.