:

Revelation 2

1

ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము - ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా

2

"నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటి వనియు,"

3

నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.

4

ఆయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది.

5

నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును.

6

"అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేను కూడ వీటిని ద్వేషించుచున్నాను."

7

చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.

8

"స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము - మొదటి వాడును కడపటివాడునై యుండి, మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా"

9

"-నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము."

10

ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.

11

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియు చెందడు.

12

పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము - వాడియైన రెండంచులు గల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా

13

సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్ను గూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింప లేదని నేనెరుగుదును.

14

"అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు."

15

అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.

16

కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధము చేసెదను.

17

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.

18

తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము- అగ్ని జ్వాలవంటి కన్నులును అపరంజిని పోలిన పాదములును గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

19

"- నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరిఎక్కువైనవని ఎరుగుదును."

20

"అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది."

21

మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.

22

"ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడ వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,"

23

దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.

24

"అయితే తుయతైరలో కమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్న దేమనగా - మీపైని మరి ఏ భారమును పెట్టను."

25

నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి.

26

"నేను నా తండ్రివలన అధికారము పొందినట్లు జయించుచు, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను."

27

అతడు ఇనుపదండముతో వానిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్ట బడుదురు;

28

మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.

29

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.

Link: