John 1
"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను."
ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను.
కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదు.
ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
దేవునియొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.
అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను.
అతడు ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను.
నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.
"ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు."
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
"తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను."
"వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు."
"ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి."
"యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు - నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటి వాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను."
ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి.
ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను.
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే -
అతడు ఎరుగననక ఒప్పుకొనెను; - క్రీస్తును కానని ఒప్పుకొనెను.
"కాగావారు - మరి నీవెవరవు, నీవు ఏలీయావా? అని అడుగగా, అతడు - కాననెను."
నీవు ఆ ప్రవక్తవా? అని అడుగగా - కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు - నీవెరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తర మియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి.
"అందుకతడు- ''ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా - అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి'' (యెషయా40:3) అని ప్రవక్తయైన యెషయా చెప్పినట్లు నేను అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను."
పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు.
"వారు - నీవు క్రీస్తువైనను ఏలీయా వైనను, ఆ ప్రవక్తవైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా,"
యోహాను - నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీమధ్య ఉన్నాడు;
"మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను."
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి - ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల.
నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నా కంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన.
నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను.
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు - ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను.
నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు - నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను.
ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితి ననెను.
"మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా,"
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి - ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను.
అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి.
"యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి - ''మీరేమి వెదకుచున్నారు?'' అని వారినడుగగా, వారు - రబ్బీ, నీవు ఎక్కడ నివాసమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి అను మాటకు బోధకుడాని అర్థము."
"''వచ్చి చూడుడి'' అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన నివాసమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను."
యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ.
"ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి - మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి,"
యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుని అర్థము. యేసు అతనివైపు చూచి - ''నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువు'' అని చెప్పెను. కేఫా అనుమాటకు రాయి అని అర్థము.
మరునాడు ఆయన గలిలయక వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని ''నన్ను వెంబడించుము'' అని అతనితో చెప్పెను.
"ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనబడు వారి పట్టణపు కాపురస్థుడు."
ఫిలిప్పు నతనయేలును కనుగొని - ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసితిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను.
అందుకు నతనయేలు - నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా ?అని అతనిని అడుగగా - వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.
"యేసు నతనయేలు తన వద్దకు వచ్చుట చూచి - ''ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటము లేదు'' అని అతని గూర్చి చెప్పెను."
"నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు- ''ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజారపు చెట్టు క్రిందనున్నప్పుడే నిన్ను చూచితిని'' అని అతనితో చెప్పెను."
"నతనయేలు- బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తర మిచ్చెను."
అందుకు యేసు- ''ఆ ఆంజారపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటి కంటె గొప్పకార్యములు చూతువు'' అని అతనితో చెప్పెను.
"మరియు ఆయన- ''మీరు ఆకాశము తెరవబడుటయు, దేవునిదూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను."