John 20
"ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను,"
"గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకు వచ్చి - ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను."
కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి.
"వారిద్దరును కూడ పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటె త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి,"
వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.
"అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి,"
"నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను."
అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.
ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.
అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.
"అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి ఒంగి చూడగా,"
"తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును, కాళ్ళవైపున మరియొకడును కూర్చుండుటకనబడెను."
"వారు - అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె - నా ప్రభువును ఎవరో ఎత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను."
"ఆమె ఈ మాట వెనుకకు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తు పట్టలేదు."
"యేసు - అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెదకుచున్నావు? అని ఆమెనడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని - అయ్యా, నీవు ఆయనను మోసికొని పోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను."
యేసు ఆమెను చూచి - మరియా అని పిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి హెబ్రీ భాషలో - రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడాని అర్థము.
యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కి పోలేదు గనుక నన్ను ముట్ట కొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి- నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కి పోవుచున్నానని వారితో చెప్పుమనెను.
"మగ్దలేనే మరియ వచ్చి - నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను."
"ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న ఇంటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి - మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను."
ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
అప్పుడు యేసు - మీకు సమాధానము కలుగునుగాక; తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.
ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది - పరిశుద్ధాత్మను పొందుడి.
మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.
"యేసు వచ్చినప్పుడు, పన్నెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను."
"గనుక తక్కిన శిష్యులు - మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు - నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను."
ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను.
"తరువాత తోమాను చూచి - నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను."
"అందుకు తోమా ఆయనతో - నా ప్రభువా, నా దేవా అనెను."
"యేసు - ''నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులు'' అని అతనితో చెప్పెను."
మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి ఈ గ్రంథ మందు వ్రాయబడలేదు గాని
"యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను."