John 21
అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా -
"సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమాళ్లును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి."
"సీమోను పేతురు - నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు - మేమును నీతో కూడ వచ్చెదమనిరి, వారు వెళ్ల దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమియు పట్టలేదు."
"సూర్యోదయ మగుచుండగాయేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు."
"యేసు - పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,"
"లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడాయన - దోనె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పినందున వల లాగలేకపోయిరి."
"కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు - ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్త్రహీనుడైయున్నందున్న పై బట్టవేసి సముద్రములో దుమికెను."
దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.
వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.
"యేసు - మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా,"
సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను; అది నూటఏబదిమూడు గొప్ప చేపలతో నిండియుండెను;
"చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు - రండి, భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున - నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు."
యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను.
యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి.
"వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి - ''యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా?'' అని అడుగగా, అతడు - అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు - నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను."
"మరల ఆయన - ''యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా?'' అని రెండవసారి అతనిని అడుగగా, అతడు - అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను? ఆయన - నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను."
"మూడవసారి ఆయన - ''యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి - ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. "
"యేసు - ''నా గొర్రెలను మేపుము. నీవు యౌవనుడువై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీ కిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీ కిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని అతనితో చెప్పెన"
అతడు ఎట్టిమరణము వలన దేవుని మహిమపరచునో దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి-''నన్ను వెంబడించుమని'' అతనితో అనెను.
"పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడను, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని - ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను."
"పేతురు అతనిని చూచి - ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను."
యేసు - ''నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుము'' అనెను.
కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని - నేను వచ్చువరకు అతడుండుట నా కిష్టమైతే అది నీకేమని చెప్పెను.
ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరుగుదుము.
యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.