Luke 11
"ఆయన ఒక రోజున ప్రార్థన చేయుట చాలించిన తర్వాత, ఆయన శిష్యులలో ఒకడు- ''ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థ్ధన చేయనేర్పుమని యడిగెను."
"అందుకాయన- ''మీరు ప్రార్థన చేయునప్పుడు - తండ్రీ, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చును గాక,"
మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;
మేము మాకు అచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడి'' అని వారితో చెప్పెను
"మరియు ఆయన వారితో ''మీలో ఎవనికైనను ఒక స్నేహితుడుండగా అతడు అర్థరాత్రివేళ ఆ స్నేహితుని యింటికి పోయి - ''స్నేహితుడ, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము."
నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి యున్నాడు; అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమియు లేదని చెప్పినయెడల
"అతడు లోపలనే యుండి నన్ను తొందర పెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్న పిల్లలు నాతో కూడ పండుకొని యున్నారు. నేను లేచి ఇయ్యలేను అని చెప్పునా ?"
"అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును."
"అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును. వెదకుడి, మీకు దొరుకును; తట్టుడి, మీకు తీయబడును"
"అడుగు ప్రతి వాని కియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను"
మీలో తండ్రియైన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు ప్రతిగా పాము నిచ్చునా ? గుడ్డునడిగితే తేలునిచ్చునా ?
కాబట్టి మీరు చెడ్ఢవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా
పరలోక మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ననుగ్రహించును'' అనెను.
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.
మరికొందరు ఆయనను శోధించుచు - పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగిరి.
ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ''తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడై పోవును - తనకు తానే విరోధమైన యిల్లు కూలిపోవును.
సాతానును తనకు తానే వ్యతిరేకముగా వేరుపడినయెడల తన రాజ్యమేలాగు నిలుచును ? నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే;
నేను బయెల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవనివలన వెళ్ళగొట్టుచున్నారు ? అందువలన వారే మీకు తీర్పరులై యుందురు.
అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకువచ్చియున్నది.
బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొను చున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును
అయితే అతని కంటే బలవంతుడొకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును
నా పక్షమున యుండని వాడు నాకు విరోధి; నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు.
"అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున - నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్ళుదుననుకొని,"
"వచ్చి ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి,"
వెళ్ళి తనకంటె చెడ్ఢవైన మరి ఏడు అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపుర ముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దాని కంటె చెడ్ఢదగును'' అని చెప్పెను.
"ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములలో నున్న ఒక స్త్రీ ఆయనను చూచి - ''నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవి'' అని కేకలు వేసి చెప్పగా,"
"ఆయన- ''అవును గాని, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు'' అని చెప్పెను."
మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్ప సాగెను. ''ఈ తరమువారు దుష్టతరము వారైయుండి సూచకక్రియ నడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు.
యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా నుండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరము వారికి సూచనగా నుండును.
దక్షిణదేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడ లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలోమోను కంటె గొప్ప వాడిక్కడున్నాడు.
నీనెవె మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడ నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడున్నాడు.''
''ఎవరును దీపము వెలిగించి చాటు చోటునైనను కుంచము క్రిందనైనను పెట్టరు కాని లోపలికి వచ్చువారికి వెలుగు నిచ్చుటకై దీపస్థంబము మీదనే పెట్టుదురు.
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుంటే నీ దేహమంతయు వెలుగు మయమై యుండును. ఆది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.
కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి గాకుండ చూచుకొనుము.
"ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే, దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగు మయమై యుండును'' అని చెప్పెను."
"ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా, ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను."
ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
అందుకు ప్రభువు- ''పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేతురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది.
"అవివేకులారా, వెలుపలిభాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా?"
కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకన్నియు శుద్ధిగా నుండును.
"అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాపా మొదలైన ప్రతి కూర లోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది."
"అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు."
"అయ్యో, మీరు కనబడని సమాధులవలె నున్నారు; వాటి మీద నడచు మనుష్యులు అవి సమాధులు అని ఎరుగరు'' అనెను."
"అప్పుడు ధర్మశాస్త్ర పండితుడొకడు - ''బోధకుడా, ఈలాగు చెప్పి మమ్మును కూడ నిందించుచున్నావు'' అని ఆయనతో చెప్పగా,"
"ఆయన - ''అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయశక్యము గాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను వాటిని ముట్టరు."
"అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు."
"కావున మీరు సాక్ష్యులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు, వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులను కట్టించుదురు."
అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా - నేను వారి యొద్దకు ప్రవక్తలను అపొస్తులులను పంపుదును.
"వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు."
కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జెకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు.; నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను
"అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు; ప్రవేశించు వారిని ప్రవేశింప నియ్యరు'' అని చెప్పెను."
"ఆయన అక్కడ నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులును, పరిసయ్యులును ఆయన మీద నిండ పగ బట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి,"
"ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకొనుటకు పొంచి, వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాట లాడింపసాగిరి."