Luke 5
జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి
ఆ సరస్సు తీరమున నున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి - దరి నుండి కొంచెము త్రోయమని అతని నడిగి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించు చుండెను.
"ఆయన బోధించుట చాలించిన తరువాత ''నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి'' అని సీమోనుతో చెప్పగా,"
"సీమోను - ''ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియు దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేయుదుము'' అని ఆయనతో చెప్పెను."
"వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలి పోవుచుండగా,"
వారు వేరొక దోనెలో నున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
"సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ళ యెదుట సాగిలపడి - ''ప్రభువా, నన్ను విడిచి పొమ్ము; నేను పాపాత్ముడను'' అని చెప్పెను."
ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడ నున్నవారును విస్మయమొందిరి.
ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు- ''భయపడకుము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువు'' అని సీమోనుతో చెప్పెను.
వారు దోనెలను దరికి జేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
"ఆయన యొక పట్టణములో నున్నప్పుడు అక్కడ కుష్టురోగముతో నిండిన మనుష్యుడొకుండెను, వాడు యేసుని చూచి సాగిలపడి - ''ప్రభువా, నాకిష్టమైతే నన్ను శుద్ధునిగా జేయగలవు'' అని ఆయనను వేడుకొనెను."
అప్పుడాయన చెయ్యి చాపి వానిని ముట్టి - ''నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్ము'' అని అనగానే కుష్టురోగము వానిని విడిచెను.
అప్పుడాయన ''-నీవు ఎవనితోను చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమె నీ దేహమును యాజకునికి కనపరచుకొని నీవు శుద్ధువైనందున మోషే నియమించినట్లు కానుకలను సమర్పించుము'' అని ఆజ్ఞాపించెను.
"అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను, బహుజనసమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకు కూడివచ్చు చుండెను."
ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను.
"ఒకనాడయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండి యుండగా, ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను."
"కొందరు మనుష్యులు పక్షవాతముగల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన యెదుట నుంచుటకు ప్రయత్నము చేసిరి గాని,"
జనులు గుంపుగూడి యుండినందున వానిని లోపలికి తెచ్చుటకు వీలుపడక పోయెను గనుక యింటి మీద కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడ యేసు యెదుట వారి మధ్యను వానిని దించిరి.
"ఆయన వారి విశ్వాసము చూచి- ''మనుష్యుడా, నీ పాపములు క్షమించబడియున్నవి'' అని వానితో చెప్పగా,"
శాస్త్రులును పరిసయ్యులును - దేవదూషణ చేయుచున్న ఇతనెవరు ? దేవుడొక్కడే తప్ప మరి ఎవరు పాపములను క్షమించగలరని ఆలోచించుకొనసాగిరి.
యేసు వారి ఆలోచనలెరిగి- ''మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు?
నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?
"అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను'' అని వారితో చెప్పి, పక్షవాతము గలవానిని చూచి - ''నీవు లేచి నీ మంచమునెత్తుకొని నీ యింటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను'' అనెను."
వెంటనే వాడు వారి యెదుట లేచి తాను పండుకొని యున్న మంచము నెత్తుకొని దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్ళెను.
అందరును విస్మయమొంది - నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమ పరచుచు భయముతో నిండుకొనిరి.
"అటు పిమ్మట ఆయన బయలు దేరి లేవియను ఒక సుంకరి, సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి యుండుట చూచి ''నన్ను వెంబడించుము'' అని అతనితో చెప్పగా,"
"అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి, ఆయనను వెంబడించెను."
"ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును, ఇతరులు అనేకులును వారితో కూడ భోజనమునకు కూర్చుండిరి."
"పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి - సుంకరులతోను, పాపులతోను మీరేలా త్రాగి తినుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి."
"అందుకు యేసు- ''రోగులకే గాని, ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు;"
"మారుమనస్సు పొందుటకై, నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు'' అని వారితో చెప్పెను."
"వారాయనను చూచి యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, ఆలాగే పరిసయ్యుల శిష్యులును చేయుదురు కాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి"
అందుకు యేసు - ''పెండ్లి కుమారుడు తమతో నున్నంత కాలము పెండ్లి యింటి వారి చేత మీరు ఉపవాసము చేయించగలరా?
పెండ్లి కుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలో వారు ఉపవాసము చేతురు'' అని చెప్పెను.
"ఆయన వారితో నొక ఉపమానము చెప్పెను, ''ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు; వేసిన యెడల క్రొత్తది దానిని చింపివేయును; అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు."
"ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు. పోసిన యెడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారి పోవును, తిత్తులును పాడగును."
అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను.
"పాత ద్రాక్షారసము త్రాగి, వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడును లేడు; పాతదే మంచిది'' అని చెప్పెను."