:

Mark 13

1

"ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు- బోధకుడా, ఈ రాళ్ళుఏలాటివో ఈ కట్టడములేలాటివో చూడుమని ఆయనతో ననెను."

2

అందుకు యేసు- ''ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి యుండకుండ పడద్రోయబడును'' అని అతనితో చెప్పెను.

3

ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని యుండగా పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి-

4

"ఇవి ఎప్పుడు జరుగును ? ఇవన్నియు నెరవేరు కాలమునకు ఏ గురుతు కలుగును ? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా,"

5

యేసు వారితో ఇట్లు చెప్పసాగెను- ''ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.

6

అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనను అని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.

7

మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

8

"జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము."

9

"మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్ములను సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములో కొట్టించెదరు, మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు."

10

సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను.

11

వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు - ఏమి చెప్పుదుమాయని ముందుగా చింతింపకుడి. ఆ ఘడియలోనే మీకేమి ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.

12

"సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు;"

13

"నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినవాడే రక్షణ పొందును."

14

మరియు నాశనకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువువాడు గ్రహించునుగాక.- యూదయలో నుండు వారు కొండలకు పారిపోవలెను.

15

మిద్దె మీద నుండు వాడు ఇంటిలో నుండి ఏదైనను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింప కూడదు.

16

పొలములో నుండు వాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.

17

"అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ."

18

అది చలి కాలమందు సంభవించ కూడదని ప్రార్థించుడి.

19

"అవి శ్రమగల దినములు. దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడును కలుగబోదు."

20

ప్రభువు ఆ దినములను తక్కువ చేయనియెడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును; ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.

21

కాగా - ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు. అదిగో అక్కడనున్నాడు అవి ఎవడైనను మీతో చెప్పిన యెడల నమ్మకుడి.

22

"ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి సాధ్యమైనయెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను అగపరచెదరు."

23

మీరు జాగ్రత్తగా నుండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను.

24

"ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు. ఆకాశము నుండి నక్షత్రములు రాలును,"

25

ఆకాశమందలి శక్తులు కదలింపబడును.

26

అప్పుడు మనుష్య కుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.

27

అప్పుడాయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొన్నవారిని పోగు చేయించును.''

28

''అంజూరపు చెట్టును చూచి యొక ఉపమానము నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంక లేతదై చిగురించునప్పుడు వసంత కాలము సమీపముగా నున్నదని మీకు తెలియును.

29

ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసి కొనుడి.

30

ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

31

ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.

32

"ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు."

33

జాగ్రత్త పడుడి- మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.

34

ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి - మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును)

35

ఇంటి యజమానుడు ప్రొద్దుగ్రుంకి వచ్చునో అర్థరాత్రి వచ్చునో కోడి కూయునప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు.

36

ఆయన ఆకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి

37

నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడి'' అనెను.

Link: