:

Mark 6

1

ఆయన అక్కడ నుండి బయలు దేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి.

2

విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింప నారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను ? ఇతని కియ్యబడిన ఈ జ్ఞాన మెట్టిది ? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి- ఇదేమి ?

3

"ఇతడు మరియ కుమారుడు కాడా ? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా ? ఇతని అక్క చెల్లెండ్రందరు మనతో నున్నారు కారా ? అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి."

4

అందుకు యేసు- ''ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడు'' అని చెప్పెను

5

అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్య పడెను.

6

ఆయన చుట్టు పట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.

7

"ఆయన పన్నెండు మంది శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి,"

8

ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలె నైనను సంచిలో సొమ్మునైనను తీసికొనక

9

"చెప్పులు తొడుగుకొను డనియు, రెండంగీలు వేసుకొన వద్దనియు వారి కాజ్ఞాపించెను."

10

మరియు ఆయన వారితో ఇట్లనెను. ''మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బసచేయుడి.

11

"ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే, మీరు అక్కడ నుండి బయలుదేరునప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపి వేయుడి''."

12

కాగా వారు బయలుదేరి మారుమనస్సు పొందవలెనని ప్రకటించుచు

13

అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి.

14

ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని బాప్తిస్మమిచ్చు యోహాను మృతులలో నుండి లేచి యున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియా రూపకములగు చున్నవని చెప్పెను.

15

"ఇతరులు - ఈయన ఏలీయా యనియు, మరికొందరు ఈయన ప్రవక్త యనియు, ప్రవక్తలలో నొకనివలె నున్నాడనియు చెప్పుకొను చుండిరి."

16

అయితే హేరోదు విని - నేను తల గొట్టించిన యోహానే మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను.

17

"హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్యయైన హేరోదియను పెండ్లి చేసికొని నందున, యోహాను - నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక"

18

ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి యుండెను.

19

హేరోదియ అతని మీద పగబట్టి అతని చంపింప గోరెను గాని ఆమె చేత కాక పోయెను.

20

"ఎందుకనగా యోహాను నీతిమంతుడును, పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతనిని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచక పోయినను సంతోషముతో వినుచుండెను."

21

అయితే తగిన దిన మొకటి వచ్చెను; ఎట్లనగా హేరోదు తన జన్మదినోత్సవ మందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను.

22

"అప్పుడు హేరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్య మాడి, హేరొదును అతనితో కూడ పంక్తిలో కూర్చున్నవారిని సంతోషపరచెను, గనుక రాజు - నీ కిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీ కిచ్చెదనని ఆ చిన్న దానితో చెప్పెను."

23

మరియు నీవు నా రాజ్యములో సగము మట్టుకు ఏమి అడిగినను నీ కిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను.

24

"గనుక ఆమె వెళ్ళి - నేనే ఏమీ అడిగెదనని తన తల్లి నడుగగా, ఆమె - బాప్తిస్మమిచ్చు యోహాను తలను అడుగమనెను."

25

వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చి - బాప్తిస్మమిచ్చు యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నా కిప్పింప గోరుచున్నానని చెప్పెను.

26

రాజు బహుగా దుఃఖపడెను గాని తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండియున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అన నొల్లకపోయెను.

27

"వెంటనే రాజు అతని తల తెమ్మని యొక బంట్రౌతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల గొట్టి,"

28

"పళ్ళెములో అతని తల పెట్టి ఆ చిన్న దాని కిచ్చెను, ఆ చిన్నది తన తల్లి కిచ్చెను."

29

యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తికొని పోయి సమాధిలో ఉంచిరి.

30

"అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నియు, బోధించినవన్నియు ఆయనకు తెలియజేసిరి."

31

"అప్పుడాయన ''మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడి'' అని చెప్పెను; ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున, భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను."

32

కాగా వారు దోనె యెక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి.

33

"వారు వెళ్ళుచుండగా జనులు చూచి, అనేకులాయనను గుర్తెరిగి, సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరుగెత్తి వారి కంటె ముందు వచ్చిరి."

34

గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొఱ్ఱెలవలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింప సాగెను.

35

"చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము; ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది."

36

చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనమునకేమైనను కొనుక్కొనుటకు వారిని పంపివేయుమని చెప్పిరి.

37

"అందుకాయన- ''మీరు వారికి భోజనము పెట్టుడి'' అనగా, వారు- మేము వెళ్ళి యిన్నూరు దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదుమా యని ఆయననడిగిరి."

38

అందుకాయన- ''మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి ? పోయి చూడుడి'' అని వారితో చెప్పెను.

39

"వారు చూచి తెలిసికొని- అయిదు రొట్టెలును రెండు చిన్న చేపలున్నవనిరి. అప్పుడాయన పచ్చిక మీద అందరును పంక్తులు పంక్తులుగా కూర్చుండవలెనని వారి కాజ్ఞాపించగా,"

40

వారు నూరేసి మంది చొప్పునను యేబది మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండిరి.

41

"అంతట ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి, వారికి వడ్డించుటకు తన శిష్యుల కిచ్చి, ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను."

42

వారందరు తిని తృప్తి పొందిన తరువాత

43

మిగిలిన చేపలను రొట్టె ముక్కలను పన్నెండు గంపల కెత్తిరి.

44

ఆ రొట్టెలు తినిన వారు అయిదు వేలమంది పురుషులు.

45

ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోనె యెక్కి అద్దరి నున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను.

46

ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను.

47

"సాయంకాల మైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య నుండెను, ఆయన ఒంటరిగా మెట్ట నుండెను."

48

అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోనె నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడు చుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు నాలుగవ జామున సముద్రము మీద నడచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని యుండెను.

49

ఆయన సముద్రము మీద నడచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి.

50

అందరు ఆయనను చూచి తొందరపగా వెంటనే ఆయన వారిని పలకరించి ''ధైర్యము తెచ్చుకొనుడి; నేనే భయపడకుడి'' అని చెప్పెను.

51

తరువాత ఆయన దోనె యెక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను; అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి.

52

అయినను వారి హృదయము కఠినమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు.

53

వారు అవతలకు వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి.

54

"వారు దోనె దిగ గానే జనులు ఆయనను గుర్తుపట్టి,"

55

"ఆ ప్రదేశమంతట పరుగెత్తికొని పోయి, ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసికొని వచ్చుటకు మొదలుపెట్టిరి."

56

"గ్రామములలోను, పట్టణములలోను, పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెనో అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయనను ముట్టిన వారందరు స్వస్థతనొందిరి."

Link: