Matthew 9
తరువాత ఆయన దోనె ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా
"జనులు పక్షవాతముతో మంచము పట్టియున్న ఒకనిని ఆయనయొద్దకు తీసుకొనివచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి - ''కుమారుడా, (బిడ్డ) ధైర్యముగా నుండుము, నీ పాపములు క్షమించబడి యున్నవి'' అని పక్షవాయువు గలవానితో చెప్పెను."
"శాస్త్రులలో కొందరు - ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా,"
యేసు వారి తలంపులు గ్రహించి ''మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు ?
నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా?
"అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను'' అని చెప్పి ఆయన పక్షవాతము గల వాని చూచి ''నీవు లేచి నీ మంచ మెత్తికొని నీ ఇంటికి పొమ్ము'' అని చెప్పగా,"
వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను.
"జనులు అది చూచి భయపడి, మనుష్యుల కిట్టి అధికార మిచ్చిన దేవుని మహిమపరచిరి."
యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి ''నన్ను వెంబడించుము'' అని చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
"ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొనియుండగా, సుంకరులును పాపులును అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి."
పరిసయ్యులు అది చూచి ''మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు?'' అని ఆయన శిష్యుల నడిగిరి.
ఆయన ఆ మాట విని ''రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కర లేదు గదా?
అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడి'' అని చెప్పెను.
"అప్పుడు యోహాను శిష్యులాయన యొద్దకు వచ్చి ''పరిసయ్యులును, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమి?'' అని ఆయనను అడుగగా,"
యేసు - ''పెండ్లికుమారుడు తమతో కూడ నుండు కాలమున పెండ్లి యింటి వారు దుఃఖప గలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు.
ఎవడును పాతబట్టకు క్రొత్తబట్ట మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును. చినుగు మరి ఎక్కువగును.
"మరియు పాతతిత్తులలో క్రొత ద్రాక్షారసము పోయరు; పోసిన యెడల తిత్తులు పిగిలి, ద్రాక్షారసము కారిపోవును; తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండును'' అని చెప్పెను"
"ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి- ''నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి ఆమె మీద నీ చేయినుంచిన యెడల ఆమె బ్రతుకును'' అనెను."
యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడ వెళ్ళిరి.
"ఆ సమయమున, పన్నెండు సంవత్సరములనుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ"
''నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును'' అని తనలో తాననుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపుచెంగు ముట్టెను.
"యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి ''కుమారీ, ధైర్యముగా నుండుము, నీ విశ్వాసము నిన్ను బాగు పరచెను'' అని చెప్పగా ఆ గడియనుండి ఆ స్త్రీ బాగుపడెను."
"అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, పిల్లనగ్రోవులు వాయించువారిని, గొల్లుచేయుచున్న జనసమూహమును చూచి-"
"''స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు'' అని వారితో చెప్పగా, వారాయనను అపహసించిరి."
జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను.
ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను.
"యేసు అక్కడినుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి - ''దావీదు కుమారుడా, మమ్మును కనికరించుము'' అని కేకలు వేసిరి."
ఆయన యింటిలో ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన నొద్దకు వచ్చిరి. యేసు - ''నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా?'' అని వారినడుగగా-
వారు - ''నమ్ముచున్నాము ప్రభువా'' అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి- ''మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక'' అని చెప్పినంతలో
వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ''ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడి'' అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను.
అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తిని ప్రచురము చేసిరి.
యేసును ఆయన శిష్యులును వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన మూగవాని ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి.
దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములాశ్చర్యపడి ఇశ్రాయేలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి.
అయితే పరిసయ్యులు-ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి.
"యేసువారి సమాజమందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగములను ప్రతి విధములైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామములయందును సంచారము చేసెను."
"ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్నందున వారిమీద కనికరపడి"
''కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు.
గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి'' అని తన శిష్యులతో చెప్పెను.