Revelation 20
మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని.
"అతడు ఆది సర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,"
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్ట బడవలెను.
"అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయుంచుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికిన వారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి."
ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము.
ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు; వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.
"భూమి నలుదిశల యందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును."
"వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను."
వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు. మృతులందరు లేచుట - కడవరి తీర్పు
మరియు ధవళమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. వాటికి నిలువచోటు కనబడకపోయెను.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరు ఆ సింహాసనము యెదుట నిలువబడియుందుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథమును విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి.
సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను.
మరణమును మృతుల లోకమును అగ్ని గుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను.