Acts 19
"ఎఫెసులో బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు అపొల్లో కొరింథులో నున్నపుడు జరిగిన దేమనగా, పౌలుపై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి, కొందరు శిష్యులను చూచి - మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా ? అని వారి నడుగగా,"
వారు - పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.
"అప్పుడతడు - ఆలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా, వారు - యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి."
"అందుకు పౌలు - యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను."
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామము నందు బాప్తిస్మము పొందిరి.
తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుచు ప్రవచించుటకు మొదలు పెట్టిరి.
వారందరు ఇంచుమించు పన్నెండుగురు పురుషులు. పౌలు ఎఫెసులో నుండుట
"తర్వాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను."
"అయితే కొందరు కఠిన పరచ బడిన వారై, యొప్పుకొనక జనసమూహము యెదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను."
రెండేండ్ల వరకు ఈలాగు జరిగెను. గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి.
మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను.
"అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలిపోయెను."
"అప్పుడు దేశ సంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు - పౌలు ప్రకటించు యేసు తోడు, మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను అను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి."
యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.
"అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ యెరుగుదును, గాని మీరెవరని అడుగగా-"
"ఆ దయ్యము పట్టినవాడు యెగిరి, వారి మీదపి వారి ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింట నుండి పారిపోయిరి."
"ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును, గ్రీసు దేశస్థులకును తెలియవచ్చి నప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను."
విశ్వసించినవారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి.
"మరియ మాంత్రిక విద్య నభ్యసించిన వారనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరి యెదుట వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా, వాటి వెల యేబది వేల వెండి రూకలాయెను."
ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో నుద్దేశించి - నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెననుకొనెను.
అప్పుడు తనకు పరిచర్య చేయువారిలో తిమోతి ఎరస్తు అనువారి ఇద్దరిని మాసిదోనియకు పంపి తాను ఆసియలో కొంత కాలము నిలిచియుండెను.
ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాల అల్లరి కలిగెను.
ఏలాగనగా - దేమేత్రి అను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పని వారికి మిగుల లాభము కలిగించుచుండెను.
"అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను జమ గూర్చి -- అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును."
"అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియ యందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు,"
"మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పి పోవుటయే గాక మహాదేవియైన అర్తెమి దేవి యొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియ యందంతటను భూలోకమందును పూజింపబడు చున్న ఈమె యొక్క గొప్ప తనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను."
"వారు విని రౌద్రముతో నిండిన వారై, - ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవియని కేకలు వేసిరి."
"పట్టణము బహు గలిబిలిగా నుండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును, అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి."
పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను గాని శిష్యులు వెళ్ల నీయలేదు.
"మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై యుండి అతని యొద్దకు వర్తమానము పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి."
ఆ సభ గలిబిలిగా నుండెను గనుక కొందరీలాగున కొందరాలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు.
అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని యెదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనముతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.
అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏక శబ్దముతో రెండు గంటల సేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేసిరి.
"అంతట కరణము సమూహమును సముదాయించి, - ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహా దేవికిని, ద్యుపతి యొద్దనుండి పిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియనివాడెవడు?"
ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురత పడి చేయకుండుట అవశ్యకము.
"మీరు ఈ మనుష్యులను తీసుకొని వచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపనూ లేదు."
"దేమేత్రికిని అతనితో కూడనున్న కంసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేమైన యున్న యెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులున్నారు గనుక వారు ఒకరితో నొకరు వ్యాజ్యెమాడవచ్చును."
అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును.
మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెచ్చెదరేమోయని భయమగుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.
అతడులాగు చెప్పి సభను ముగించెను.