:

Ephesians 6

1

"పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే."

2

"నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,"

3

అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.

4

"తండ్రీలారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి."

5

"దాసులారా, యథార్థమైన హృదయము గల వారై భయముతోను వణకుతోను క్రీస్తునకు వలె, శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై యుండుడి."

6

"మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే గాక క్రీస్తు దాసులమని యెరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు,"

7

మనుష్యులకు చేసినట్టు గాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి.

8

దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు.

9

"యజమానులారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోకమందున్నాడనియు, ఆయనకు పక్ష పాతము లేదనియు ఎరిగిన వారై, వారిని బెదిరించుట మాని ఆప్రకారమే వారి యెడల ప్రవర్తించుడి."

10

తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

11

మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి వంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.

12

"ఏలయనగా, మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాధులతోను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము."

13

"అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చినవారై, నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి."

14

"ఏలయనగా, మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుగుకొని,"

15

పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి.

16

ఇవన్నియు గాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు.

17

"మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి."

18

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

19

"మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్ళలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు"

20

దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.

21

మీరును నా క్షేమ సమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.

22

"మీరు మా సమాచారము తెలిసికొనుటకును, అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీయొద్దకు పంపితిని."

23

"తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును, విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక."

24

మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక.

Link: