:

Luke 9

1

"యేసు తన పన్నెండుమంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి"

2

"దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును, వారిని పంపెను."

3

"మరియు ఆయన వారితో - ''ప్రయాణము కొరకు మీరు చేతి కర్రనైనను జాలెనైనను, రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు; రెండు అంగీలు ఉంచుకొన వద్దు."

4

మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలు దేరుడి.

5

మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరు నప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపి వేయుడి'' అని వారితో చెప్పెను.

6

"వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచరించిరి."

7

"చతుర్థాదిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని, ఎటూ తోచకయుండెను. ఏలయనగా, కొందరు - యోహాను మృతులలోనుండి లేచెననియు,"

8

"కొందరు ఏలీయా కనబడెననియు, మరి కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి."

9

అప్పుడు హేరోదు నేను యోహాను తలకొట్టించితిని గదా; ఎవని గూర్చి ఈ సంగతులను వినుచున్నానో అతడెవడో యని చెప్పి; అట్టి వానిని చూడగోరెను.

10

"అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియ జేయగా, ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను."

11

"జన సమూహములు అది తెలిసికొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసినవారిని స్వస్థపరచెను."

12

సూర్యాస్తమయము అగుచున్న సమయములో పన్నెండుమంది శిష్యులు వచ్చి - మనమీ అరణ్యములోనున్నాము గనుక చుట్టుపక్కల నున్న గ్రామములకును పల్లెలకును వెళ్ళి బసచూసుకొని ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూములను పంపివేయుమని ఆయనతో చెప్పిరి.

13

"ఆయన- ''మీరే వారికి భోజనము పెట్టుడి'' అని వారితో చెప్పగా, వారు - మన యొద్ద ఐదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు. మేము పోయి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్ధములు కొని తెద్దుమా అని అడిగిరి."

14

వచ్చినవారు సుమారు ఐదు వేలమంది పురుషులు.

15

ఆయన - ''వారిని యేబదేసి మందిని చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండ బెట్టుము'' అని శిష్యులతో చెప్పగా వారాలాగున చేసి అందరిని కూర్చుండబెట్టిరి.

16

". అంతట ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చిన్న చేపలను ఎత్తికొని ఆకాశము వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి జనసమూహ మునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను."

17

. వారందరును తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల కెత్తిరి.

18

"ఒకప్పుడాయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద నుండిరి. యేసు - ''నేనెవరనని ప్రజలు చెప్పుకొనుచున్నారు?'' అని వారి నడుగగా,"

19

"వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలీయా యనియు, మరి కొందరు పూర్వకాల ప్రవక్త ఒకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి."

20

"అందుకాయన- ''మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారు'' అని అడుగగా, పేతురు - నీవు దేవుని క్రీస్తువనెను."

21

"ఆయన ఇది ఎవరితోను చెప్పవద్దు'' అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి,"

22

"''మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యము'' అని చెప్పెను."

23

"మరియు ఆయన వారినందరిని ఉద్దేశించి ''ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ నెత్తుకొని, నన్ను వెంబడింపవలెను."

24

తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును.

25

ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకొనిన యెడల లేక నష్టపరచుకొనిన యెడల వాని కేమి ప్రయోజనము?

26

"నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడు వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును, తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును."

27

ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను'' అనెను.

28

"ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినముల తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను."

29

ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన దుస్తులు తెల్లగా నిగ నిగ లాడుచుండెను.

30

దగదగలాడు తేజస్సుతో మరి ఇద్దరు పురుషులుఆయనతో మాటలాడుచుండిరి. వారిద్దరు మోషే మరియు ఏలీయాలు.

31

వారు మహిమతో కనబడి యెరూషలేములో ఆయన నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాటలాడుచుండిరి.

32

పేతురును మిగిలిన వారును నిద్ర మత్తులోనుండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమ తేజస్సును ఆయనతో కూడ తేజస్సుతో నున్న ఇద్దరు పురుషులను చూచిరి.

33

"ఆ యిద్దరు పురుషులు వెళ్ళిపోవుచుండగా, పేతురు యేసుతో - ఏలినవాడ, మన మిక్కడ వుండుట మంచిది, నీకొకటి, మోషే కొకటి, ఏలీయా కొకటి ముగ్గురికిని మూడు పర్ణశాలలు మేమిక్కడ కట్టుదుమని తాను చెప్పుచున్నదేమిటో తనకు తెలియకుండనే చెప్పెను."

34

అతడులాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; మేఘము వారిని కప్పినప్పుడు శిష్యులు భయపడిరి.

35

ఆ మేఘములో నుండి ఒక స్వరము ''ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు -ఈయన మాట వినుడి'' అని ఒక శబ్ధము వినిపించెను.

36

ఆ శబ్దము వచ్చిన తరువాత అక్కడ వారికి యేసు మాత్రమే కనిపించెను. తాము చూచిన ఈ సంగతులను శిష్యులు చాలాకాలము వరకు ఎవరికిని చెప్పలేదు.

37

మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనకు ఎదురుగా వచ్చెను.

38

"ఆ జన సమూహములలో నొకడు- బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు,"

39

"ఒక దయ్యము వచ్చి వానిని ఆవరిస్తుంది, ఆ సమయములో వాడు బిగ్గరగా కేకలు వేయుచు, నురుగుకారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదల కుండును."

40

దానిని వెళ్ళగొట్టుని నీ శిష్యులను అడిగితిని కాని వారి చేత కాలేదని ఆయనకు మొర్రపెట్టుకొనెను.

41

"అందుకు యేసు - ''విశ్వాసము లేని మూర్ఖ తరమువారలారా, నేనెంతకాలము మీతో కూడ నుండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడకు తీసుకొని రమ్ము'' అనెను."

42

వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రి కప్పగించెను

43

. కనుక దేవుని మహిమను చూచి అందరు ఆశ్చర్యపడిరి.

44

". ఆయన చేసిన కార్యములను చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా, ఆయన- ''ఈ మాటలు మీ చెవులలో నాట నీయుడి. మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు'' అని తన శిష్యులతో చెప్పెను."

45

. అయితే వారాయన మాట గ్రహింపకుండునట్లు వారికది మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలిసికొనలేదు; మరియు ఆ మాటను గూర్చి ఆయనను వివరములడుగుటకు వారికి ధైర్యము చాలలేదు.

46

"తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా,"

47

యేసు వారి హృదయాలోచననెరిగి ఒక చిన్నబిడ్డను తీసుకొని తన యొద్ద నిలువబెట్టి

48

''ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవానిని చేర్చుకొనును. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై యుండునో వాడే గొప్పవాడు'' అని వారితో చెప్పెను.

49

"యోహాను - ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి; వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక వానిని ఆటంక పరచితిమని చెప్పెను."

50

అందుకు యేసు - ''మీరు వానిని ఆటంక పరచకుడి; మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే'' అని చెప్పెను.

51

"ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగు చున్నప్పుడు,"

52

"ఆయన యెరూషలేముకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తన కంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని,"

53

ఆయన యెరూషలేమునకు వెళ్ళ నభిముఖుడైన కారణముచేత వారాయనను చేర్చుకొనలేదు.

54

"శిష్యులైన యోహానును, యాకోబును అది చూచి -"

55

"ప్రభువా, ఏలీయా చేసినట్లు ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీ కిష్టమా? అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి ''మీరేలాటి మనుష్యులు ?"

56

మనుష్య కుమారుడు మనుష్యుల ప్రాణములను రక్షించుటకే గాని నశింప జేయుటకు రాలేదు'' అని గద్దించెను. అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్ళిరి.

57

వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు - నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.

58

"అందుకు యేసు- ''నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుట కైనను స్థలము లేదు'' అని అతనితో చెప్పెను."

59

"ఆయన మరి యొకనితో నా వెంట రమ్మని చెప్పెను, అతడు- నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవిచేసెను."

60

అందుకాయన- ''మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము; నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపుము'' అని వానితో చెప్పెను.

61

"మరియొకడు - ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని నా యింటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా,"

62

యేసు - ''నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు'' అని వానితో చెప్పెను.

Link: