:

Mark 1

1

దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము.

2

''ఇదిగో నీకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నా దూతను పంపుచున్నాను.'' (మలాకీ3:1)

3

''ఆలకించుడి. అడవిలో నొకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి'' (యెషయా40:3)

4

"అని ప్రవక్తలచే వ్రాయబడినట్లు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో నుండి పాప క్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చెను."

5

"అంతట యూదయ దేశస్తులందరును, యెరూషలేము ప్రజలందరు బయలుదేరి, ఆయన యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి."

6

"ఈ యోహాను ఒంటె రోమములతో చేసిన వస్త్రములు ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, అడవి తేనెను మిడుతలను ఆహారముగా తీసుకొనుచు జీవించెడివాడు."

7

అతడు ''నాకంటె శక్తిమంతుడొకడు నావెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకైనను పాత్రుడను కాను.

8

నేను నీళ్ళతో (నీళ్ళలో) మీకు బాప్తిస్మమిచ్చు చున్నాను గాని ఆయన పరిశుద్ధాత్మలో (పరిశుద్ధాత్మతో) మీకు బాప్తిస్మమిచ్చున''ని ప్రకటించుచుండెను.

9

ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను.

10

"ఆయన నీళ్ళలో నుండి బయటకు వచ్చుచుండగా, ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట కనబడెను."

11

"అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము- ''నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించు చున్నాను'' అని వినవచ్చెను."

12

అప్పుడాయన పరిశుద్ధాత్మ ప్రేరణతో అరణ్యములోనికి పోయెను.

13

"అరణ్యములో ఆయన అపవాదిచేత శోధింపబడుచు నలువది దినములు అరణ్య మృగములతో కూడ నుండెను, మరియు దేవదూతలాయనకు పరిచర్య చేయుచుండిరి."

14

యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు గలిలయకు వెళ్ళి సువార్త ప్రకటించ మొదలు పెట్టెను.

15

''కాలము సంపూర్ణమైయున్నది దేవుని రాజ్యము సమీపించి యున్నది. మారుమనస్సు పొంది సువార్తను నమ్ముడి'' అని ప్రకటించ సాగెను.

16

ఆయన గలిలయ సముద్రపుటొడ్డునుండి నడచి వళ్లుచుండగా వలవేసి చేపలు పట్టుచున్న సీమోనును అతని సహోదరుడు ఆంద్రెయ కనబడిరి. వారు జాలరులు యేసు వారిని పిలిచి

17

"''నా వెంట రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేసెదను'' అని చెప్పగా,"

18

వెంటనే వారు తమ వలలను విడిచి ఆయనను వెంబడించిరి.

19

ఆయన మరి కొంత దూరము వెళ్ళగా జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును తమ దోనెలో కూర్చుని వలలను సరిచేసుకొనుచుండగా ఆయనకు కనబడిరి.

20

ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రియైన జెబెదయిని దోనెలో జీతగాండ్ర దగ్గర విడిచి ఆయనను వెంబడించిరి.

21

వారంతా కపెర్నహూము పట్టణానికి వెళ్ళినప్పుడు యేసు విశ్రాంతి దినమున సమాజమందిరమునకు పోయి బోధింపసాగెను.

22

ఈయన శాస్త్రులవలె కాక అధికారముగల వానివలె బోధించగా వారంతా ఆశ్చర్యపడిరి.

23

ఆ సమయమున అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఆ సమాజ మందిరములో నుండెను.

24

"వాడు- నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవరవో నాకు తెలియును. నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను."

25

అందుకు యేసు వానితో- ''ఊరకుండుము.

26

వానిని విడిచిపొమ్ము'' అని గట్టిగా గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వానిని విడిచి పోయెను.

27

"అందుకు అక్కడున్నవారు విస్మయమొంది ఆయన బోధ క్రొత్తగా ఉన్నదనియు, ఆయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో నొకడు చెప్పుకొనిరి."

28

వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను.

29

"వారు సమాజమందిరములో నుండి వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను సీమోను, ఆంద్రెయ అనువారి ఇంట ప్రవేశించిరి."

30

"సీమోను అత్త జ్వరముతో పడియుండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పినప్పుడు,"

31

ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయిపట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.

32

సాయంకాలమున ప్రొద్దు గ్రుంకినప్పుడు జనులు సర్వ రోగములతో బాధపడుచున్నవారిని దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొనివచ్చిరి.

33

"అచ్చట జనమంతయు ఆ ఇంటిముందు గుమిగూడి యుండగా, ఆయన"

34

నానా విధములైన రోగముల చేత బాధపడుచున్న రోగులను అనేకులను స్వస్థపరచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. ఆ దయ్యములకు తానెవ్వరో తెలుసు గనుక ఆయన వాటిని మాట్లానియ్యలేదు.

35

తెల్లవారు జామున ఇంకా చాలా చీకటిగా యున్నప్పుడు యేసు లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ఏకాంతముగా ప్రార్థించుచుండెను.

36

"సీమోనును అతనితో ఉన్నవారును ఆయనను వెదకుచూ వెళ్ళి,"

37

"ఆయనను చూచి అందరూ నీ కొరకు వెదకుచున్నారని చెప్పగా,"

38

"ఆయన వారితో- ''చుట్టు ప్రక్కలనున్న గ్రామములకు వెళ్ళి ప్రకటించుదము, నేను దానికొరకే గదా ఇక్కడికి వచ్చియున్నాను'' అని వారితో చెప్పెను."

39

ఆయన గలిలయయందంతట వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచునుండెను.

40

"ఒక కుష్టురోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళాని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, వేడుకొనగా"

41

"ఆయన కనికరపడి, చెయ్యి చాపి వానిని ముట్టి-''నా కిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము'' అని వానితో చెప్పెను."

42

వెంటనే కుష్టు రోగమతనిని విడువగా వాడు శుద్ధుడాయెను.

43

అప్పుడాయన వానితో ఆ విషయమెవరికి చెప్పవద్దనియు

44

"నీవు పోయి, శుద్ధుడైననందువలన సాక్ష్యార్ధమై తన దేహమును యాజకునకు కనపరచుకొనవలసినదిగాను మోషే నియమించిన కానుకలను సమర్పించవలసినది గాను అతనిని ఖండితంగా ఆజ్ఞాపించి పంపివేసెను."

45

"అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రచురము చేయనారంభించగా, ఆయన యిక పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక ఊరుబయట అరణ్య ప్రదేశములో నుండెను. అన్ని ప్రాంతములనుండి ప్రజలు ఆయన దగ్గరకు వచ్చుచుండిరి."

Link: