Mark 3
ఆయన సమాజమందిరమునకు మరల వెళ్ళినప్పుడు అక్కడ ఊచచెయ్యిగల వాడు ఒకడుండెను
అక్కడనున్నవారు ఆయన మీద నేరము మోపదలచి విశ్రాంతి దినము వాడిని ఆయన స్వస్థపరచునేమో యని ఆయనను కనిపెట్టుచుండిరి.
"ఆయన ''నీవు లేచి మధ్యను నిలువు'' మని ఊచచేయి గల వానితో చెప్పి, అక్కడనున్న వారిని చూచి-"
"''విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడుచేయుట ధర్మమా? ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా?'' అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి."
"ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, కోపముతో వారిని కలయచూచి ''నీ చెయ్యి చాపుము'' అని ఆ మనుష్యునితో చెప్పెను. అతడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను."
"పరిసయ్యులు వెలుపలికి పోయి, వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయననేలాగు సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి."
యేసు తన శిష్యులతో కలసి సముద్రమునొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను.
"ఆయన ఎన్నో గొప్ప కార్యములను చేయుచున్నాడని విని జనులు యూదయ నుండియు, యెరూషలేము నుండియు, ఇదూమయనుండియు, యోర్దాను అవతలి నుండియు తూరు సీదోను అను పట్టణ ప్రాంతములనుండియు ఆయన యొద్దకు గుంపులు, గుంపులుగా వచ్చిరి."
"జనులు గుంపులుగానుండి అక్కడ ప్రదేశమంతయు ఇరుకుగా నున్నందున, ఆయన తనకొక దోనె సిద్ధపరచవలసినదిగా తన శిష్యులకు చెప్పెను."
ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగపీడితులైన వారందరు ఆయనను ముట్టుకొనవలెనని ఆయన మీద పడుచుండిరి.
అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన యెదుట సాగిలపడి- నీవు దేవుని కుమారుడవని చెప్పుచూ కేకలు వేసిరి.
తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన అందరికిని ఖండితముగా ఆజ్ఞాపించెను.
ఆయన కొండయెక్కి తన కిష్టమైన వారిని కొందరిని పిలువగా వారాయన వద్దకు వచ్చిరి.
"వారు తనతో ఉండునట్లును, దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని"
ఆయన పన్నెండుమందిని నియమించెను.
"వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను,"
"జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బొయనేర్గెసు (ఉరుముకు పుత్రులు) అని పేరు పెట్టెను."
"ఆంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను"
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అను వారు.
ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులుగా వచ్చియున్నందున వారికి భోజనము చేయుటకు కూడ వీలులేకపోయెను.
ప్రజలలో కొందరు ఆయనకు మతి చలించినదని చెప్పగా దానిని విని ఆయన యింటివారు ఆయనను తీసికొని పోవుటకు వచ్చిరి.
"యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు, ఆయనకు బయల్జెబూలు దయ్యము పట్టినది గనుక దయ్యాల రాజు అధికారముతో ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడుఅని చెప్పగా"
అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమానరీతిగా వారితో ఇట్లనెను- ''సాతాను సాతానునేలాగు వెళ్ళగొట్టును?
ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ రాజ్యము నిలువనేరదు.
ఒక యిల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన యెడల ఆ యిల్లు నిలువనేరదు.
సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన యెడల వాడు నిలువలేక కడతేరును.
ఒకడు బలవంతుడైన వాని యింటిలో కన్నము వేయదలచిన యెడల ముందు ఆ బలవంతుని బంధించవలెను అప్పుడే అతని యింటిని దోచుకొనగలడు.
సమస్త పాపములును మనుష్యులు చేయు దూషణలును క్షమించబడును గాని
పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయు వాడెన్నటికిని క్షమింపబడక శాశ్వతమైన నిత్య పాపము చేసినవాడుగా పరిగణింపబడును'' అని చెప్పెను.
శాస్త్రులు ఆయన దయ్యముపట్టిన కారణముగా ఆయన వారితో ఇట్లు చెప్పవలసివచ్చెను.
"యేసు తల్లియు సహోదరులును వచ్చి బయట నిలిచి ఆయనను పిలువ నంపిరి, జనులు గుంపులు గుంపులుగా చుట్టూ వున్నందున ఒకడు వచ్చి-"
"యేసు తల్లియు సోదరులును వచ్చి వెలుపల ఆయన కొరకు వేచియున్నారని చెప్పగా, ఆయన-"
''నా తల్లి నా సహోదరులు ఎవరు ?'' అని
"తన చుట్టూ వున్న వారిని కలయ చూచి ''వీరే నా తల్లి నా సహోదరులు,"
"దైవ చిత్తము చొప్పున జరిగించువారే నా సహోదరుడును, సహోదరియు నా తల్లియు'' అని చెప్పెను."