Matthew 21
తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండ దగ్గరనున్న బేత్పగే అను గ్రామమునకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి -
"''మీ యెదుట నున్న గ్రామమునకు వెళ్ళుడి; వెళ్ళగానే అక్కడ కట్టబడి యున్న ఒక గాడిదయు, దానితో నున్న దాని పిల్లయు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలికొని రండి."
"ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పుడి, వెంటనే అతడు వాటిని తోలి పంపును'' అని చెప్పి వారిని పంపెను."
ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు - ఇది జరిగెను. అదేమనగా
"''సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా నుండుడి, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు'' (జెకర్యా9:9)"
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి
ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను.
జనసమూహములోను అనేకులు దారిపొడుగున తమ బట్టలను పరచిరి. కొందరు దారి పొడుగున చెట్లకొమ్మలను పరచిరి. ఆయన వెళ్ళుచుండగా
"జన సమూహములు ఆయన ముందు వెనుక నున్నవారు - ''దావీదు కుమారునికి జయము (హోసన్నా), ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక, కీర్తనలు118:26. సర్వోన్నతమైన స్థలములలో జయము (హోసన్నా)'' అని కేకలు వేయుచుండిరి."
ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరోనని కలవరపడెను.
జనసమూహము- ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.
"యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారనందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి -"
''నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును (యెషయా56:7). అయితే దానిని మీరు దొంగల గుహగా చేసితిరి'' అనెను.
గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.
కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను 'దావీదు కుమారునికి జయము' అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి -
"వీరు చెప్పుచున్నది వినుచున్నావా? యని ఆయన అడుగగా, యేసు - ''వినుచున్నాను'', ''బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు'' (కీర్తన8:2) ''అను మాట మీ రెన్నడును చదువలేదా?'' అని చెప్పి,"
వారిని వదిలి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బసచేసెను.
ఉదయమున పట్టణమునకు మరల వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని యుండి
త్రోవ పక్కన నున్న యొక అంజూరపు చెట్టును చూచి దానియొద్దకు రాగా దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని - ''ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు గాక'' అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండి పోయెను.
శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.
"అందుకు యేసు - ''మీరు విశ్వాసము కలిగి సందేహపకుండినయెడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాక అని చెప్పిన యెడల ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల మీరు వాటినన్నిటిని పొందుదురు'' అని వారితో చెప్పెను.
"ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా, ప్రధానయాజకులును ప్రజల పెద్దలును వచ్చి ఆయనను - ''ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ? ఈ అధికారము ఎవడు నీ కిచ్చెను అని అడుగగా,"
యేసు -''నేనునూమిమ్మునొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పిన యెడల నేనును ఏ అధికారమువలన ఈ కార్యములను చేయుచున్నానో అది మీకు చెప్పుదును.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది ? పరలోకము నుండి కలిగినదా లేక మనుష్యుల నుండి కలిగినదా యని వారి నడిగెను. వారు - మనము పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన ఆలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలనడుగును.
మనుష్యుల వలన అని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము అందరు యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి.
అందుకాయన - ''ఏ అధికారము వలన నేనీ పనులు చేయుచున్నానో అది కూడ నేను మీకు తెలుపను''.
"''మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యుని కిద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి -'కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పనిచేయు'మని చెప్పగా, వాడు -"
పోనని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను.
"అతడు రెండవ వాని యొద్దకు పోయి ఆ ప్రకారమే చెప్పగా వాడు - 'అయ్యా, పోదుననెను' కాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు?'' అని వారిని అడిగెను."
అందుకు వారు మొదటి వాడే ననిరి. యేసు - ''సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చియున్నాడు మీరు అతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్యలును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపలేదు''
"''మరియొక ఉపమానము వినుడి - ఇంటి యజమాను డొకుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి, గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను."
పండ్లకాలము సమీపించినపుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ రైతుల యొద్దకు తన దాసులను పంపగా
"ఆ కాపులు అతని దాసులను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి మరియొకని మీద రాళ్ళు రువ్విరి."
మరల అతడు మునుపటికంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని కూడ ఆ ప్రకారమే చేసిరి.
"తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని, తన కుమారుని వారి యొద్దకు పంపెను."
"అయినను ఆ రైతులు కుమారుని చూచి - ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని,"
అతనిని పట్టుకొని ద్రాక్షతోట వెలుపల పడవేసిచంపిరి
"కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయును ? అని అడుగగా,"
"అందుకు వారు - ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర రైతులకు ఆ తోటను గుత్త కిచ్చును అని ఆయనతో చెప్పిరి."
మరియు యేసు వారిని చూచి - ''ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అది యెహావా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము'' (కీర్తన 118:22-23) ''అను మాటను మీరు లేఖనములలో ఎన్నడును చదువలేదా ?
కాబట్టి దేవుని రాజ్యము మీయొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనుల కియ్యబడును.
మరియు ఈ రాతి మీద పడువాడు తునకలై పోవును గాని అది ఎవడి మీద పడునో వానిని అది నలి చేయును.'' అని చెప్పెను.
"ప్రధాన యాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్ముని గూర్చియే ఆయన ఆ ఉపమానము చెప్పెనని గ్రహించి"
ఆయనను పట్టుకొనవలెనని సమయము చూచుచుండిరి గాని ప్రజలందరు ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి.